Monday, June 8, 2009

"అమ్మా! అక్కా బావొచ్చారే!" చిన్న కూతురు మానస కేక విని తడి చేతుల్ని పొడి కొంగుకు తుడుచుకుంటూ బయటికొస్తున్న దేవకి మనసులో మల్లెల జల్లు కురిసింది. పెద్దకూతురు భారతి కెదురెళ్లి గుండెలకు హత్తు కుంది. అల్లుణ్ని ఆప్యాయంగా పలుకరించింది. అత్తగారి ఆదరణ సుధీర్‌ను ఉత్సాహ పరచింది.
"బావకేమమ్మా!" మానస అక్క చెయ్యందుకుంది. "గుంద్రాయిలాగున్నారు. మంచి ఉద్యోగం, అందాల బొమ్మ అక్క. కాని... అక్కనే చీపురు పుల్లలాగైంది" గలగలా నవ్వేసింది. సుధీర్ కెదురెళ్లి సూటుకేసందుకుంది.
"పాపం ముప్పూటలా తింటూ కూచోలేక మీ అక్క అలాగై పోయింది తల్లీ!" మరదలు నెత్తిమీద మొట్టికాయిచ్చాడు సుధీర్. భార్య వైపు చూస్తూ "ఈ సిసింద్రీ పిల్లకు చిచ్చుబుడ్డి మొగుడు దొరుకుతాడులే భారతీ!" హామీ ఇచ్చాడు.
"మా మానస అతణ్ని మూడు దేశాలు తిప్పి మూడు సముద్రాల నీళ్లు తాగిస్తుంది... జాగ్రత్త!" భారతి కనుబొమ్మలు గర్వంగా ఎగిరి పడినై.
"అబ్బా! లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చు గదా!" దేవకి.
"వస్తున్నా... లోపలికొస్తున్నానోయ్!" నారాయణ హుషారుగా కండువా సర్దుకుంటూ లోపలికొచ్చేశాడు. భర్త చిలిపిదనం దేవకి నాశ్చర్యంలో ముంచెత్తింది.
"లోపలికి రమ్మన్నది తమరిని కాదు".
"అయితే నేను బయటి కెళ్లాలా?" కండువా దులిపాడు.
"చూడమ్మా! మీ అమ్మ మర్యాద!" కూతుళ్లతో మొరపెట్టుకున్నాడు.
అందరూ హాయిగా నవ్వుకుని కుశల ప్రశ్నల్లోకి దిగారు.
దీపావళి పండక్కి ఓరోజు ముందే వస్తున్నట్లు వారం క్రితమే ఫోన్ చేశాడు సుధీర్. నారాయణ సంబరం అంబరాన్నంటింది."పిల్లలేరి అల్లుడూ?"
"ఇద్దరూ రెసిడెన్షియల్ స్కూలే గదా! ఎక్స్‌కర్షన్‌కు తీసుకెళ్లారు స్కూలు వాళ్లు".
"సరే గానీ... ఎన్నిసార్లు రమ్మన్నా మా ఇంటికెందుకు రావట్లేదు నాన్నా?" భారతి నిలదీసింది. "చెల్లి వద్దన్నదా".
"అదెందుకంటుందమ్మా! మీరిద్దరూ నాకు కళ్లు. మగ పిల్లలు లేరు గదా! అయినా ఈ ఊళ్లో ఓ గ్రంథాలయం ప్రారంభించాము. రెగ్యులర్ లైబ్రేరియన్ వచ్చేదాకా నేనే లైబ్రేరియన్ను.అంతేకాదు. ఈ ఊళ్లో ఓ జూనియర్ కాలేజీ ప్రారంభించాలని తిరుగుతున్నాం.."
"అయితే మామగారు రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్న మాటా!" సుధీర్ అనేశాడు. లోలోపల మాత్రం పూర్ ఫెలో... పట్నంలో రిటైరై పల్లెటూరుకొచ్చిండు.. ఉడుక్కుంటున్నాడు.. గొణుక్కొంటున్నాడు.
సైకాలజీ లెక్చరర్‌గా పని చేసిన నారాయణ కంతా అవగతమైంది.
"పాడి పంటలకు పుట్టిల్లు పల్లెటూరు అల్లుడూ! రేపటి పౌరులకు పల్లెటూర్ల గురించి అవగాహన లేకపోతే బియ్యం చెట్లు, మామిడి తీగలు అనేస్తారు".
గొల్లున నవ్వారంతా. సుధీర్‌కు గూడా తప్పలేదు.
దేవకి వంటింట్లో కెళ్లింది. సోఫాలో కూచుండి కబుర్లలోకి దిగారు. మానస మధ్యలోనే వెళ్లింది వంటింట్లోకి.
ముగ్గురి కబుర్లు ముచ్చటగా సాగిపోతున్నై.
"చాయ గరం... చా గరం..." రైలు డబ్బాలో చాయవాలాలా రాగాలుదీస్తూ ట్రేతో సుధీర్ ముందుకొచ్చింది మానస. ముందుకు వంగి కప్పందుకున్నాడు. మరదలిని ఆపాదమస్తకం పరిశీలిస్తున్నాడు. సింధూర వర్ణం దేహ చాయ, అపురూపమైన అంగసౌష్టవము... కుందనపు బొమ్మలాగుంది మానస.
తమకు సంతానయోగం లేదనుకుని అత్తామామయ్యలు భారతిని అనాథ శరణాలయం నుంచి తెచ్చి పెంచుకున్నారట. కాని... భారతి ఎస్సెస్సీ పాసైంతర్వాత మానస పుట్టిందటా... గుర్తుకొచ్చింది... పెదాలు చప్పరిస్తూ ఖాళీ కప్పు మానసకిచ్చాడు.
"మరో డోసు గరం చాయ వేసుకో బావా!" మానస చాతీ మీదున్న జడ కొందపాకుతున్న నల్లనాగులా గుంది. మూడు రాళ్ల ముక్కు పుడక సమ్మోహనాస్త్రం లాగుంది.
"చాయకేం గానీ! ఈ కొసరి వడ్డింపులేవో పండగ కట్నం వద్ద చూపించండి మరదలు గారూ!"
"ఇంకా పండగ కట్నమా?" ముక్కుమీద వేలేసుకుంది మానస. " మా అక్కనే లక్షల కట్నం బావగారూ!" అంటూ భారతి చేతిలోంచి ఖాళీ కప్పందుకుని తుర్రుమంది.

* * *

నిండుగా ... సద్దుల బతుకమ్మలాగున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్ హద్దులు దాటి పల్లె బాటలో పయనిస్తోంది.
ఆనాడు ఆర్మీలో చేరకపోతే ఈ రోజీ బ్యాంకు ఉద్యోగమొచ్చేదా?... యుద్ధంలో పోగొట్టుకున్న కాలు... మోకాలు వరకు ... స్థానములో అమర్చిన జైపూర్ కాలును సర్దుకుని సీటుకు జేరగిల బడ్డాడు మధుకర్. కుదుపులతో బస్సు ముందుకెళ్తూంటే ఆలోచనలు వెనక్కు లాక్కెళ్తున్నాయి...
స్పృహ తెలియని వయసులో అమ్మానాన్నలు చనిపోయారు. యాక్సిడెంటులో ప్రాణాలొదులుతూ మామయ్య చేతుల్లో పెట్టారు. ఇంటర్ పాసవగానే ఆర్మీలో ఉద్యోగమొచ్చింది, ట్రయినింగ్ కెళ్ళబోతుంటే మావయ్య కళ్లు మంచు పూలైనాయి.
"మిల్ట్రీలో పనిచెయ్యడం గర్వకారణమే కాని మధూ! నువ్వు నా గారాల చెల్లి తీపిగుర్తువురా!" గొంతు వణికింది.
"మాకు కొడుకుల్లేరు.. నువ్వే మా కొడుకువు" అత్తయ్య ఆవేదన... అతలాకుతలం చేసింది. ఇద్దరినీ సముదాయించవలసి వచ్చింది.
పదో తరగతి పరీక్షలకు తయారవుతున్న మానస "అమ్మా! బావకా ఉద్యోగం దొరికడమదృష్టమే... పోనివ్వండి" మానస మద్దతుతో మనసు తేలికైంది.
మనసు తెరమీద మానస ప్రత్యక్షమైంది... చిన్నప్పుడూ బడిలో, గుడిలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మరదలు పెళ్లీడుకొచ్చింది. ఎవరు చేసుకుంటారో కాని అదృష్టవంతుడే. కార్గిల్ యుద్ధములో కాలు పోకపోతే మానస నా సొంతమయ్యేదేమో!...
కీచుమంటూ ఆగింది బస్సు. పెట్టుడు కాలును మరోసారి సరిచూసుకుని బస్సు దిగాడు.
సాయం సమయం, పల్లె వాతావరణం కన్నతల్లి ఒడి లాగుంది. తన కళ్లముందే పెరిగిన చెట్లు తోవకిరువైపులా సైనికుల్ల నుంచుండి తలలాడిస్తూ స్వాగతం పలుకుతున్నాయి. మేతకెళ్లిన పక్షులు ఆకాశమార్గాన వరుసలు కట్టి తిరిగొస్తున్నాయి. సుప్రథాత సమయాన అడవికెళ్లిన పశువులు ఇంటికి తిరిగొస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గోధూళి ఆ పక్షులనందుకోవాలని ఆరాట పడుతోంది.
ఇల్లు దగ్గరైంది. ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాలో దొరికిన బ్యాంకు ఉద్యోగంలో చేరిన్ తర్వాత ఊరికి రావడమిదే మొదటి సారి. ఊరు కొత్త హంగులు సంతరించుకొంటోంది.
"రామ రామ రామ రామ రాఘవా
నా స్వామివని నమ్మితి దరి జేర్చి బ్రోవవా..." పక్కింటి అరుగు మీద కూచున్న రామయ్య తాత పాట ఆపాడు. ముందుకు వంగి పరీక్షగా చూస్తూ "ఎవరూ... మధుకర్ బాబేనా?" పలకరించాడు.
"అవును తాతా బాగున్నావా!"
"బాగున్నా నాయనా! భారతమ్మ భర్తతో వచ్చేసిందప్పుడే. చల్లగా బతుకు..."
గడపలోనే ఎదురైంది మానస. మొహం విచ్చుకుంది.
"అమ్మా! మధు బావొచ్చాడే!" చిన్నపిల్లలా కేరింతలు కొడుతూ చేతిలోని సూట్‌కేసు లాక్కొంది. "అక్కా మధు బావొచ్చాడే!" వసారాలోకొస్తున్న భారతి కెదురెళ్లింది. భారతి మూతి మూడు వంకర్లు తిరిగింది.
"ఎక్కడెవ్వరూ దిక్కులేరు గదా! ఇక్కడికి రాక ఇంక్కెక్కడికెళ్తాడు?" గొణుక్కుంటూ వచ్చి సోఫాలో కూచుంది. సుధీర్ వచ్చి భార్య పక్కన కూచున్నాడు.
"వదినా, అన్నా.. బాగున్నారా?" మధుకర్ వచ్చి వారికెదురు సోఫాలో కూచున్నాడు. మానస సూటుకేసిచ్చింది. పెట్టుడు కాలును తొలగించాడు. సూటుకేసులోంచి మలిచి పెట్టిన చంక కర్రను తీసి అమర్చుకుని పక్కన పెట్టుకున్నాడు.
"పిల్లలు రాలేదా అన్నా?" తానే మళ్లీ పలుకరించాడు.
"రాలేదు గానీ బ్యాంకు ఉద్యోగం బాగుంది గదా!" చిరాకును అదిమిపెట్టి అడిగాడు పైకి. లోపల మాత్రం "కుంటి కులాసం ఇంటికి మోసం. మామగారి ఆస్తిని అమాంతం సొంతం చేసు కుంటానని ఊడి పడ్డాడు వెధవ!" ఉడుక్కున్నాడు.
అక్కా బావల ప్రవర్తన మానసకేమాత్రం నచ్చలేదు.
"రా బావా! డ్రెస్సు మార్చుకో!" సూట్‌కేసును పెట్టుడు కాలుతో సహా గదిలోకి తీసుకెళ్లింది. మధుకర్ నిట్టూర్చాడు. చంక కర్ర సాయంతో లేవబోతుంటే గుడికెళ్లిన నారాయణ దంపతులొచ్చారు.
"ఒరే మధుకర్... బాగున్నావా!" చిరునవ్వుతో వచ్చి మధుకర్‌ను గుండెలకు హత్తుకున్నాడు. మేనమామ ఒడి దేవుని గుడిలాగుంది.
"అబ్బ! చాలా రోజులైంది మధూ నిన్ను చూసి" దేవకి ఎద పొంగింది.

* * *

కొండంత పండగ దీపావళి. తూరుపు ఆకాశం బంగారు రంగు పులుము కుంటోంది.
"బావా... అక్కా!" తలుపుమీద టకటకలు. "అక్కా! పొద్దు పొడవకముందే హారతులు తీసుకోవాలి"మానస మేలుకొలుపు.
"తయారవుతున్నాం గానీ కొంచెమాగవే!" భారతి ఆవులించింది.
"నేనాగితే పొద్దాగుతుందా! మీదే ఆలస్యం... మధు బావ గూడా రెడీ!"
కమ్మని నిద్ర ఖరాబైనందుకు కోపంగా ఉంది సుధీర్‌కు.
"వానికేం! తెగినగాలి పటం." భార్య చేతిలోంచి తువ్వాలు లాక్కొని బాత్రూంలో చొరబడ్డాడు. పది నిమిషాలు గూడా కాలేదు. భారతి అందుకుంది.
"అబ్బా! త్వరగా తెమలండీ! అమ్మానాన్నలకు కోపమొస్తే బాగుండదు."
"అవును" సుధీర్ గుండెల్లో గుండు సున్నా కనబడింది. "ఆ పట్నం బంగళా ఆ కుంటి కులాసం గాడికో, మానసకో ఇచ్చేస్తారేమో" దువ్వెన అందించింది.
"నిజమే భారతి! మా ఆఫీసర్ కొడుకు అమెరికాలో ఇంజనీరు. అతనికి మానస ఫోటో పంపానని చెప్పాను గదా! అంతనికి మానస నచ్చిందటా. త్వరలోనే ఇండియా వస్తున్నాడు. వాళ్లు కోటీస్వరులు. కట్నం గూడా అడగరటా. పెళ్లవగానే మీ చెల్లి గూడా అతనితో అమెరికా ఉడాయిస్తుంది..." డ్రెస్సు వేసుకుంటూ మురిసిపోతున్నాడు.
"హబ్బా! మీ బుర్ర లాప్‌టాప్ కంప్యూటర్ సుమా!" సంతోషం పట్టలేక చెయ్యందుకుని ముద్దు పెట్టుకుంది."ఆ తర్వాత పట్నం బంగళా మనకొచ్చేస్తుంది..."
చాలారోజుల తర్వాత కూతుళ్లు, అల్లుడు, మేనల్లుడుతో గడపడం అమితానందంగా ఉంది దేవకి దంపతులకు. పెద్దకూతురు-అల్లుడికి బొట్టు పెట్టి కొత్త డ్రెస్సులందించారు.
వాళ్లు డ్రెస్సులు మార్చుకునేందు కెళ్లారు. దేవకి పూజ పూర్తి చేసింది. తాంబూలములో ఐదు రకాల పళ్లు, కుడకలు, జాకెట్ గుడ్డలు వగైరాలు తయారుగా ఉన్నాయి.
"మంగళ హారతి రెడీయా?" జరీ అంచు కండువా భుజమ్మీదేసుకుంటూ వచ్చి అడీగాడు నారాయణ. గొంతులో ఖుషీ.
"ఓ తయార్. మీదే ఆలస్యం" ఆశ్చర్యంగా చూసింది భర్తను.
నారాయణ చూపులామె మీద నిలబడిపోయినై. నుదుట కుంకుం బొట్టు... చాయ పసుపు రాసుకున్న మొహం నిగనిగలాడ్తోంది.
పాల నురగలాంటి తెల్లని ధోవతి,లైట్ గ్రీన్ సిల్క్ లాల్చీ... నా భర్త ఇప్పటికీ నవ మన్మథుడే! అనుకుంటుంటే దేవకి బుగ్గల మీద సిగ్గు చాయలు దోబూచులాడినై.
"భారతీ, మానసా... రండర్రా!" కొంగు నోటికడ్డం పెట్టుకుని నవ్వాపుకుంది. భారతి, సుధీర్లు చెట్టాపట్టలేసుకుని కొత్తడ్రెస్సుల్లో వచ్చారు.
"అమ్మా!" ఇదే సమయమనుకుంది భారతి. "మానసను ఆ అవిటివాడి కెంతదూరములో ఉంచితే అంత మంచిదే!" పట్టు చీరను అట్టహాసంగా సర్దుకుంది.
మొహం చిట్లించి కూతుర్ని ఎగాదిగా చూసింది దేవకి.
"దేశం కోసం వాడు అవిటివాడయాడు. నా చేతుల్లో పెరిగాడు గదమ్మా" గంభీరంగా అంది."దానికి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది".
"ముందు పెళ్లి చేసి... ఆ తర్వాత అతని గురించి...."
"ఆలోచించాలంటావు గదమ్మా!" నారాయణ అందుకున్నాడు."ఎవరికెట్లా రాసి పెట్టిందో తెలీదు గదా!"
మానస మధుకర్ లొచ్చేశారు పూజ గదిలోకి.
"అంతా వచ్చేశాం. ఇహ కానివ్వండి"నారాయణ ఆదేశం. చిన్న చాపల మీద మగవారు వరుసగా నుంచున్నారు. వారి కభిముఖంగా ఆడవారు మంగళ హారతితో నుంచున్నారు.
ఆడవాళ్ళు మగవారికి బొట్టుపెట్టి హారతులిస్తుంటే అందరికళ్లు ఆనంద జ్యోతులైనాయి.మగవారు ఆడవారికి బొట్టు పెట్టి కుడుకలు, జాకెట్ గుడ్డలు మంగళహారతిగా మారిన తాంబూలములో ఉంచారు. జేబుల్లోంచి రూపాయి నాణాలు తీసి అదే తాంబూలములో రాశిగా పోశారు. నాణేల మీద అంతా పసుపు కుంకుమలు వేస్తున్నారు.
"ఇదే ధనలక్ష్మీ పూజ గదా మావయ్యా!" ఉల్లాసంగా అడిగాడు మధుకర్.
"అవున్రా! నరకాసుర సమ్హారంతో కష్టాల దేవత పోయి ధనలక్ష్మి వచ్చేసిందని భావన. ఆ ధనలక్ష్మి పూజ చేసి ప్రసన్నం చేసుకుంటే సకల సంపదలిస్తుంది..."సుధీర్ వైపు చూస్తూ అన్నాడు నారాయణ. వెంటనే కొబ్బరి కాయకొట్టాడు.
"నిజమే! మన దేశములో ప్రతి పండక్కీ ఓ నేపథ్యముంది బ్రదర్!"మధుకర్ వీపు తట్టాడు సుధీర్.
దేవునికి నైవేద్యంగా చూపిన సేమియాలో పంచదార కలిపి పంచింది మానస. అందరూ బయటకొచ్చి తపాసులు కాల్చుతుంటే వంటింట్లో దేవకి పనిమనిషి సాయంతో వంట చేస్తోంది.టపాసుల పనిబట్టిన వారంతా లోపలికొచ్చి సోఫాల్లో కూచున్నారు.
"సేమీయా పెట్టిన చేతుల్తో పప్పన్నం పెట్టాలి మరదలా!"మానస అంతరంగాల్లో ఏ తరంగాలున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు సుదీర్.
"తప్పకుండా బావా!"ఎర్రని పెదాల మీద చిరునవ్వులు ముత్యాల్లా మెరిశాయి.
నా మరదలుకు నా మాటంటే ఎంతో గురి... గర్వంగా నవ్వుకున్నాడు సుధీర్. మధుకర్ మనసులో మల్లెలు నవ్వినై.
"అయితే త్వరలో మానసను పెళ్లికూతురుగా చూస్తామన్న మాటా!" మందహాసము.
సిగ్గుల భారముతో మానస చెక్కిళ్లు ఎర్రబారినై. మధుకర్ కళ్లలోకి సూటిగా చూసింది.
భారతి భర్త వైపు చూస్తూ "ఆ తర్వాత మధుకర్ పెళ్లే గదా!" కళ్లను అర్థవంతంగా తిప్పేసింది.
"మావయ్యా! మధుకర్‌కో సంబంధం చూసి పెట్టుంటారు" కూపీ లాగాలని సుధీర్ ప్రయత్నం. నారాయణ లేచి మధుకర్ పక్కన కూర్చున్నాడు.పక్కనున్న చంక కర్ర గుండెల్ని మెలిపెట్టింది.
"మీ అమ్మనోసారి పిలువమ్మా!" మానసను పురమాయించాడు.
దేవకి వచ్చి కూచుంది. నారాయణ వాలకం గంభీరమైంది.
"మధూ! నువ్వెవరినైనా ప్రేమించావా?" సూటిగా అడిగాడు.
మధుకర్ మౌనం. దేవకి అయోమయంగా చూసిందతణ్ని.
నారాయణ దంపతుల పట్ల మధుకర్ అణువణువా కృతజ్ఞతతో నిండి ఉంది..."మావయ్యా! అమ్మా నాన్నా ఎలాగుంటారో నాకు తెలీదు. మీరే అమ్మానాన్నలనుకున్నాను. మీకు తెలీకుండా ఏదీ చెయ్యను".
భారతి-సుధీర్‌ల మొహాలు వెలిగి పోయినై. ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ అవతారానికో ప్రేమ గూడానా! అన్నట్టుగుందా ముసిముసి. విషయమేమిటో దేవకి కర్థమౌతోంది.
"నాన్నా! మీరన్నా, దేశమన్నా మధు బావకెంతో గౌరవం" మానస భావోద్వేగం. హృదయవీణ కల్యాణ రాగం పలుకుతోంది.
పక్కింటి వాళ్లు కాలుస్తున్న చిచ్చుబుడ్డి వెలుతురు కిరణాలు నునులేత సూర్యకిరణాలతో పోటీ పడలేక పోతున్నాయి.
ఇంకేదో కూపీ లాగాలనుంది సుదీర్‌కు.
"మరి మా కొంటె మరదలు మానస ఎవరినన్నా ప్రేమించలేదని గ్యారంటీ ఏమిటీ? ముందు మానస పెళ్లనుకున్నాం గద్ద!"
"బావకు థాంక్స్!" మానస తలపైకి లేచింది.
"అవునమ్మా!" పూల జడను గుండెల మీదికి లాక్కుంటూ తల్లిదండ్రుల వైపు చూసింది. అంతరంగాల్లోని పొంగులు చెక్కిళ్లను మెరిపిస్తున్నాయి.
"చెప్పు మానసా!" సుధీర్ అత్యుత్సాహం. "ఆ అదృష్టవంతుడెవరో. అతడెవరైనా సరే... ఒప్పించి మెప్పించి నీ పెళ్లి జరిపిస్తాం".
బిత్తరబోయి మొహాలు చూసుకుంటున్న తల్లిదండ్రుల హావభావాలను కళ్లతో ఏరుకుంటున్న భారతి మానస పక్కకొచ్చింది.
"చెప్పు చెల్లీ... నీ మానస చోరుడెవరో!"బుగ్గ గిల్లింది.
మానస ఓర చూపులు మధుకర్ మీదికి మళ్లాయి.
"మధుకర్ బావ ఆర్మీలో చేరుతానన్నప్పుడే నా మనసిచ్చాను. చిన్నపట్నుంచి కలిసి తిరిగాం గదా! మధుకర్ గుండె గుడిలో నేనున్నానన్న సంగతి నాకు బాగా తెలుసు. కాబట్టి నిర్మొహమాటంగా మాట్లాడుకున్నాం.పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం".
"అవును మావయ్యా!" మధుకర్ మనసు మయూరమై నర్తిస్తోంది. "మేమింతకు ముందే మాట్లాడుకున్నాం".
నారాయణ దంపతుల మనసుల్లో సంతోష తరంగాలెగిసి పడినై.
"శుభం...." కోరస్ ఆశీస్సులు.
సుధీర్ దంపతులు తేలుకుట్టిన దొంగల్లాగైపోయారు.

(నవ్య వీక్లీ ఫిబ్రవరి 11, 2009 సంచికలో ప్రచురింప బడింది.)